తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు! 8 d ago
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించేందుకు, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చర్యలు తీసుకుంటుంది. టీజీపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇటీవల విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, 3, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2, 4 ను నిర్వహించనున్నారు. ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. గ్రూప్-2 పరీక్ష మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల లోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నియామక ప్రక్రియ ముగిసేవరకు ప్రశ్నాపత్రాలు, హాల్‌టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 783 గ్రూప్ - 2 పోస్టులకు 5.57 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.